సాగర తీరం


నిశ్శబ్దంగా కూర్చున్న అలా సాగర తీరాన
చాలా ఏకాంతంగా.
నీ ఎడబాటుతో నన్ను నాకు వద్దనుకునేంత అసహ్యం.
అలల అలజడి సాగరంలో కన్నా నా మదిలో
నీ వాణి బాణాల సడే ఎక్కువగా ఉంది.
ఒక్కో అల నా పాదాన్ని తాకి వెళ్తు చెబుతుంది
ఇంకో కొత్త మలుపు రాబోతుంది చూడు.
వదిలి వెడలిన జత ఇంకో రూపంలో జతపడకమానదు. మేం పదే పదే నిన్ను స్పర్శిస్తూ దూరమవుతూ
ఇంకో అలలా దగ్గరవుతున్నట్టు అని.
ఇక నే కూర్చున్న తీరం చెబుతుంది
ఎప్పుడూ తటస్థంగా ఉండు.
అలలు వచ్చి నాతోనే సావాసం చేయట్లేదని నేనలిగానా?
వచ్చినపుడు వద్దనను వెళ్లేటపుడు కాదనను.
ప్రతీ క్షణం ఆస్వాదించు.
అలల రాకపోకలకు అలజడితో చెదిరిపోకు అంది.
అపుడే అవగతమైంది నా ప్రయాణం ఇంకా ఉంది.
నా తీరాన్ని తాకి వెళ్ళిన ఆ అల తాత్కాలికం కాని
ఎన్నో అలల ఆశాతీరం నేనని తెలిసింది.
వెంటనే లేచి ముందుకు సాగా..
సాగరం సందడితో సంబరాన్ని సమకూర్చుతుందనుకున్నానేగాని సందేశాన్ని కూడా పంచుతుందనుకోలేదు.
ఒక సాగరమే కాదు ప్రతీ వస్తువు, ప్రతీ ప్రదేశం,ప్రతీ భావం మనకేమైనా తెలపాలనుకుంటాయేమో!
తరచి తరచి పరీక్షిస్తే ప్రతి మలుపులో ప్రతి అడుగు మనకో సందేశ భాండాగారమే.

Comments

Post a Comment

Popular posts from this blog

మధురభావాలు

ముఖాముఖి