Posts

Showing posts from 2019

వెతాంతమా ఇకనైనా వరించుమా......

Image
వెత గుప్పెడంత గుండెని పిండుతుంటే గుండేమో గుట్టుగ రక్తాక్షరాల్ని స్రవిస్తుంది. భయపడుతూ బ్రతుకుతున్న ప్రతీక్షణం మది ఓ సంశయంతో కూడిన సంఘర్షణలోనే చిత్రవదననుభవిస్తుంది ఏదో ఒకనాడు ఆయువు పోసిన ఈ అక్షరాలు కూడా ఒంటరిని చేసి దూరమైపోతాయేమోనని. అక్షర పరిచయమైతే గాని తెలీలేదు గుండెలో గుప్పుమంటున్న ప్రేమలోతెంతో అక్షరీకరిస్తే గాని తెలీలేదు ఈనాటి అదుపులేని చర్యలే ఒకనాటికి నిలువెత్తు సాక్ష్యాలై నిన్ను వేలెత్తి చూపుతాయని అలాగే ప్రేమగాఢతకు ప్రతీకలవుతాయని.. ప్రతీ యుద్ధానికి ఆది,అంతం అంటూ ఖచ్ఛితంగా ఉండనే ఉంటాయి.. కాని ఈ అంతర్యుద్ధానికెందుకో ఆది మాత్రమే ఉంది. అంతం ఛాయలు ఊహకు కూడా చిక్కనంత సుదూరంగా ఉన్నాయ్. కాలాన్ని వెనక్కి నెడుతూ తననెంత దరిచేర ప్రయత్నిస్తున్నా నీ వల్ల కాదంటూ నీకసలు ప్రాప్తమేలెదంటుంది. ఐనా సరే అంతం ఉందనిపిస్తుంది అది కేవలం మళ్ళీ నీరాకతోనే సాధ్యమనిపిస్తుంది.

......

Image
నీ మనసుకు వినిపించేంత గట్టిగా అరిచి చెప్పాలనుంది నా చుట్టు ప్రక్కల దిక్కులు పెక్కుటిల్లేలా బద్ధలవ్వాలనుంది ఎందుకీ నరకం ఎంతదాకా నాకీ మధనం ఎవరి గూర్చి ఇంత యాతనను అనుభవిస్తున్నామో వాళ్ళకే తెలియజెప్పుకోలేని దుస్థితేంటే నిర్భాగ్యమైన మనసా! జాలి కూడా జాలిపడుతుందే నీ దుర్భర వెతను గాంచి కన్నీరు కూడా కాలం చేస్తున్నాయే నీ నిత్య ధారల జూసి

మౌనం

Image
ఎందుకీ మౌనం అసలిది మౌనమా? లేక భావోద్వేగం విధించినా సంకెలా? ఉన్నట్టుండి నన్నావహించే ఈ  భావావేశానికి అసలు ఏ పేరు పెట్టాలి! కోపమా? ప్రేమా? అసూయా? స్నేహమా? సందిగ్ధంలో పడటమే తప్ప బదులు దొరకదే నాకు నే సర్ది చెప్పుకోవడం తప్ప సర్దుమనగదే కొద్దిసేపటి ఈ సడిలేని కారాగారం ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది ప్రతీది ఎందుకంత అమితమంటూ నిగ్గదీస్తుంది ఇకనైనా తమాయించుకోమంటూ హెచ్చరిస్తుంది ఒక్కటి మాత్రం స్పష్టంగా అవగతమయ్యేలా చేస్తుంది నీ మనఃశాంతిని నీకు నువ్వే హరించుకుంటున్నావని నీ వ్యక్తిత్వానికి నువ్వే గ్రహణం పట్టించుకుంటున్నావని తెలుస్తుంది మనసుకిది కాని ఎందుకో అదిగమించలేకపోతుంది బలహీనతే తలెత్తుకు తిరుగుతుంది బలాన్ని నిర్దాక్షిణ్యంగా కూలదోస్తుంది అయినా కాలమను కల్లోలినిలో పరిగెత్తే ప్రతీ ఒక్కరు పరిస్థితుల గాలానికి చిక్కవల్సిందేగా చిత్రవిచిత్రానుభవాల్ని అనుభవిస్తూ సాగిపోవల్సిందేగా.

వేడుక

Image
పిరికివాడికి సంపద ధైర్యవంతుడికి ఆపద పిరికివాడు ఆపదనెదుర్కోలేడు కనుకే దేవుడు సంపదను మూటగట్టి శ్రీమంతుడిని చేస్తాడు. ధైర్యవంతుడికి ఆపద మీద ఆపదనిచ్చి దారిద్ర్యంలో ఊగిసలాడుతూ ఇంకెలా పైకొస్తావో చూస్తా అని పరీక్షిస్తాడు.   అసలు ఈ సృష్టిలో ఏది శాశ్వతము కాదు అంటారుగా? మరి శ్రీమంతుడి సంపద ఎందుకు తరగదు! బీదవాని ఆకలి ఎందుకు తీరదు! జీవితం అంతా ఊహల వేడుకెనా? కనుల కనువిందు కష్టమేనా? అవసరానికి మించిన ధనము ఎప్పటికి తృప్తినివ్వదు నిరతం ఎవరు దోచుకెల్తారో అన్న ఉలిక్కిపాటు నిద్రలేని రాత్రులు తప్ప. Plz help to the poor people. Atleast మీ పాప,బాబులతో ఐన వారి పుట్టినరోజులకైనా ఉన్నవారిని పిల్చి తిని,తాగి ఆ తతంగం కన్నా వాళ్ళతో ఇంకొకరికి ఆ ఒక్కరోజైనా లేనివాడికి ఇవ్వడం నేర్పించండి. వారికి ఆశీస్సులు అందటంతో పాటు helping nature పెరుగుతుంది. కనీసామ మున్ముందు తరమైనా బాగుపడుతుంది. మనం వ్యర్ధంగా పడేసే నాలుగు మెతుకులు దొరికితే తిని ఈ పూట బ్రతుకుదామనుకునేవారు కొకొల్లలు. కాదంటారా? మీరు నేలపాలు జేసే ఎంగిలి మెతుకులకై మీ ముంగిట వేచే డొక్కెండిన జీవులెన్నో. మీ ఇంట‌ పాచి పాడైన విషమైనా ప...

వివాహం

Image
వివాహం అతి గొప్ప బంధం ఎంత మంది వదిలి వెడలినా కలకాలం కలిసుండమని భగవంతుడు మూడు ముళ్ళ బంధంతో ముడేసే ముచ్చటైన బంధం.   యవ్వన పల్లకిని గమ్యం చేర్చే వారధి వివాహ బంధం అప్పటివరకున్న ఒంటరి బ్రతుకులో ఒక తోడు ప్రపంచాన్ని ఇంకా అందంగా చూపిస్తుంది. ఏదో తెలియని భరోసా నాకంటూ ఒకరున్నారనే ఆత్మ సంతృప్తి చిలకా గోరింకంటి కాపురం అపుడపుడు చిరుకోపాలు అవి నీటి బుడగల్లాంటివని తెలిపే చిరు సరసాలు. సంపాదించుకున్న చిరు మొత్తాన్ని ఒకటికి పది సార్లు లెక్కపెట్టుకుని దాచుకొని కలిసి కష్టసుఖాల పంచుకోవడం. మొదటిసారి తల్లి/తండ్రి కాబోతున్నప్పటి అనిర్వచనీయ సంతోషం అనుభవించే సమయంలో తమకే తెలియని ఆనంద భాష్పాలు. ఆ కలల ఫలితం కళ్ళముందు కదలాడుతుందిక కాసేపట్లో అనుకునే క్షణంలో గుండె దడ. ఆ పసి ప్రాణం కనుతెరిచి లోకాన్ని చూసినపుడు మన కనులు రెప్ప వేయడం మరిచే క్షణాలు. తన ఎదుగుదల నుండి వివాహం వరకు తీస్కునే జాగ్రత్తలు సంతానం ఒక్కో తప్పటడుగు ఒక్కో పిడుగుపాటు వాటన్నిటిని ఎదుర్కని తీర్చి దిద్ది వారి వారి జీవితాలకొక అర్ధం కల్పించి తాతయ్య,నానమ్మ పదవి పొందడమే దేశ ప్రధానిలా గర్వపడడం ఆ శేష జీవితాన్ని సంతృప్తిగా అనుభవిస...

సాగర తీరం

Image
నిశ్శబ్దంగా కూర్చున్న అలా సాగర తీరాన చాలా ఏకాంతంగా. నీ ఎడబాటుతో నన్ను నాకు వద్దనుకునేంత అసహ్యం. అలల అలజడి సాగరంలో కన్నా నా మదిలో నీ వాణి బాణాల సడే ఎక్కువగా ఉంది. ఒక్కో అల నా పాదాన్ని తాకి వెళ్తు చెబుతుంది ఇంకో కొత్త మలుపు రాబోతుంది చూడు. వదిలి వెడలిన జత ఇంకో రూపంలో జతపడకమానదు. మేం పదే పదే నిన్ను స్పర్శిస్తూ దూరమవుతూ ఇంకో అలలా దగ్గరవుతున్నట్టు అని. ఇక నే కూర్చున్న తీరం చెబుతుంది ఎప్పుడూ తటస్థంగా ఉండు. అలలు వచ్చి నాతోనే సావాసం చేయట్లేదని నేనలిగానా? వచ్చినపుడు వద్దనను వెళ్లేటపుడు కాదనను. ప్రతీ క్షణం ఆస్వాదించు. అలల రాకపోకలకు అలజడితో చెదిరిపోకు అంది. అపుడే అవగతమైంది నా ప్రయాణం ఇంకా ఉంది. నా తీరాన్ని తాకి వెళ్ళిన ఆ అల తాత్కాలికం కాని ఎన్నో అలల ఆశాతీరం నేనని తెలిసింది. వెంటనే లేచి ముందుకు సాగా.. సాగరం సందడితో సంబరాన్ని సమకూర్చుతుందనుకున్నానేగాని సందేశాన్ని కూడా పంచుతుందనుకోలేదు. ఒక సాగరమే కాదు ప్రతీ వస్తువు, ప్రతీ ప్రదేశం,ప్రతీ భావం మనకేమైనా తెలపాలనుకుంటాయేమో! తరచి తరచి పరీక్షిస్తే ప్రతి మలుపులో ప్రతి అడుగు మనకో సందేశ భాండాగారమే.

ఒక మనసు

Image
నిదురకు దూరమై నీ తలపుకు దగ్గరై మమతకు దూరమై నీ ఎడబాటుకు దగ్గరై చిద్విలాసానికి దూరమై నటనకు దగ్గరై నివ్వెరబోతూ నడియాడుతుందిలే ఒక నాతి మనసు నడిరాతిరి నీ జ్ఞాపకాల లహర్యలే తన ఏకైక జతయంటూ ఏ గాయం నిను చుట్టుముట్టదంటూ ఏ నాదం నిను కదిలించదంటూ ఏ మౌనం నిను మాటాడించదంటూ ఏ భారం నిను రప్పించదంటూ కను గుమ్మం ఆవలి రెప్పల తలుపులు మూతబడనీకుండా పహారా కాస్తూ పరధ్యానంలో పడిపొతుంది పంచప్రాణాలకు పట్టాదారుడగు పురుషోత్తముని గూర్చి పల్లవిస్తూ.. అలా నిశికి నెచ్చెలియై నిదురను హతమారుస్తున్న తన కనుపాప అలవక మునుపే ఈ పలవరింత ప్రతిధ్వనిస్తుండగనే ఉష పరిగెత్తుకొస్తుందని నిర్ఘాంతబోతుందిలే! ఒక మనసు.

ముఖాముఖి

Image
ముఖాముఖి ఇంతకీ ఎవరితో! మనిషితోనా? మనసుతోనా? తరిమే కాలమడుగులకు నువు మడుగులు ఒత్త పరిగెత్తే నీ ఉరుకుల పరుగుల జీవిత పయనాన నిత్యం ప్రయత్నంగానో అప్రయత్నంగానో ఎవరో ఒకరితో ముఖాముఖి అవ్వాల్సిందే  అది మరి వాదనకో,వంతపాడేందుకో కాలయాపనకో,కష్టసుఖాలనార్చేందుకో కాకుల్లా పొడుచుకు తినేందుకో,కన్నీటి వర్షాన్ని పరామర్శించేందుకో కారణమేదైనా దాని ప్రతిఫలమేదైనా లాభపడ్డామా? నష్టపోయామా అంటూ తీరుబడిగ లెక్కలేస్కుంటూ కూర్చునే నీ చిన్ని జీవితంలోని అమూల్యమైన సమయాన్ని నీకోసం కేవలం నీకోసం కేటాయించలేవా ఒక్క క్షణం  నీ జీవితపుస్తకంలోని ప్రతీ పేజీకి ప్రాధాన్యతను సంతరించుకోనివా? నీకై నిర్దేశించబడిన నిమిషాల్లో నుండి ఒక్క నిమిషాన్ని నీ స్వార్ధానికి నువ్వు వాడుకోలేవా! నీతో నువ్వు, నీ మనసుతో నువ్వు ముఖాముఖి అవలేవా? ఒక్కసారి ప్రయత్నించి పరికించి చూడు నీకే తెలుస్తుంది  నీ మనసుతో మాట్లాడి చూడు నిన్ను నీకు తెలుపుతుంది సరికొత్తగ నిన్నావిష్కరిస్తుంది నీ తను వేగంతో జతకట్టలేక వేసారిన తను నువ్వాగిన ఈ నిమిషంతో ఊపిరి పీల్చుకుంటుంది నీతో కబుర్లు చెబుతుంది  నీకేంటి నీకు నేనున్నాగా ...

కార్తీక దీపం

Image
పున్నమి వెలుగులో చంద్రికలా చక్కనమ్మ చందన వర్ణ చీరలో పంచవన్నెల చిలక పరికిణీ కట్టినట్టుగా మెరుపు తెర మేనుకు మేలిముసుగు ధరించినట్టుగా మువ్వల కల నెరవేరేలా పదనిసలు పల్లవించేలా నువ్ పట్టీలు పెట్టుకుని అలా...... కదిలొస్తుంటే... పరధ్యానం అందుకే పుట్టిందా అనిపించింది. ఆ క్షణం నిన్నలా చూస్తూ ఉండిపోయా... ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఎందుకున్నానో తెలియకుండా పరుగులు పెడుతున్నా నీ వెనకాల భ్రమరానికి మతి భ్రమించిందనిపించేంతగా. కోవెలలో కుందనపుబొమ్మలా నువ్ నిలబడి ముక్కంటిపై నీ మనసంతా లగ్నం చేసి లయ తప్పని లహరిలా మంత్రముచ్ఛరిస్తుంటే నాకు మాత్రం నన్ను వశపరుచుకునేందుకు మంత్రం జపిస్తున్నావనిపించిందే ప్రియసఖి.. నీ కోమల కౌశలంతో నువ్వలా కోనేటిలో కార్తీక దీపాన్ని జారవిడుస్తుంటే ఒక్కసారిగా నాకే తెలుపక నా గుండె జారిపోయిందే.. జావరాల. ఆ ముక్కంటి ప్రసన్నుడయ్యాడో లేదో నీ ఆరాధనకు కాని నేను మాత్రం భీభత్సంగా ప్రసన్నుడినయ్యా నీ సోయగానికి ఊపిరున్నంత వరకు కోలుకోలేనంతగా. కాస్తైనా జాలి లేదటే నీకు మరీ అంతలా కనులను కట్టీపడేసేంతలా కదిలిరావాలా.

మధురభావాలు

Image
ఎన్నో మధురభావాలు అలలై ఎగిసిపడుతుంటే అవధులు దాటిన ఆనందం అంబరాన్ని తాకుతుంటే అంబరానికి ధరణికి నడుమ నే ఊగిసలాడుతున్నా నీ ఊహానివాసంలో ఉత్సవమే కంటున్నా సిగ్గుతో ఎర్రబడ్డ సొట్టబుగ్గలు ఎవరే అతగాడని గిలిగింతలెడుతున్నా చీ! పోమ్మంటూ ముసి ముసి నవ్వులనే లంచంగా బదులిస్తూ తప్పించుకు తిరుగుతున్నా అదిరే అధరాలు ఆమనిలా విరిసి మెలితిరిగే కురుల ముంగురులు కబుర్లు చెబుతూ కాకాపడుతున్నా అలలై ఎగిసే మధురభావాల చిలిపి అలజడులకు చిక్కక అంబరాన్ని తాకే ఆనందానికి అణువణువు పులకిస్తున్నా నాలో నే నిలవక కేరింతలేస్తున్నా