ఒక మనసు
నిదురకు దూరమై
నీ తలపుకు దగ్గరై
మమతకు దూరమై
నీ ఎడబాటుకు దగ్గరై
చిద్విలాసానికి దూరమై
నటనకు దగ్గరై
నివ్వెరబోతూ నడియాడుతుందిలే
ఒక నాతి మనసు
నడిరాతిరి నీ జ్ఞాపకాల లహర్యలే
తన ఏకైక జతయంటూ
ఏ గాయం నిను చుట్టుముట్టదంటూ
ఏ నాదం నిను కదిలించదంటూ
ఏ మౌనం నిను మాటాడించదంటూ
ఏ భారం నిను రప్పించదంటూ
కను గుమ్మం ఆవలి రెప్పల తలుపులు
మూతబడనీకుండా పహారా కాస్తూ
పరధ్యానంలో పడిపొతుంది
పంచప్రాణాలకు పట్టాదారుడగు
పురుషోత్తముని గూర్చి పల్లవిస్తూ..
అలా నిశికి నెచ్చెలియై
నిదురను హతమారుస్తున్న తన
కనుపాప అలవక మునుపే
ఈ పలవరింత ప్రతిధ్వనిస్తుండగనే
ఉష పరిగెత్తుకొస్తుందని
నిర్ఘాంతబోతుందిలే!
ఒక మనసు.


Superb Lathagaru
ReplyDeleteThank u andi..☺
ReplyDelete