ముఖాముఖి
ముఖాముఖి
ఇంతకీ ఎవరితో!
మనిషితోనా?
మనసుతోనా?
తరిమే కాలమడుగులకు నువు మడుగులు ఒత్త పరిగెత్తే నీ ఉరుకుల పరుగుల జీవిత పయనాన నిత్యం ప్రయత్నంగానో అప్రయత్నంగానో ఎవరో ఒకరితో ముఖాముఖి అవ్వాల్సిందే
అది మరి
వాదనకో,వంతపాడేందుకో
కాలయాపనకో,కష్టసుఖాలనార్చేందుకో
కాకుల్లా పొడుచుకు తినేందుకో,కన్నీటి వర్షాన్ని పరామర్శించేందుకో
కారణమేదైనా దాని ప్రతిఫలమేదైనా
లాభపడ్డామా? నష్టపోయామా అంటూ తీరుబడిగ లెక్కలేస్కుంటూ కూర్చునే నీ చిన్ని జీవితంలోని అమూల్యమైన సమయాన్ని నీకోసం కేవలం నీకోసం కేటాయించలేవా ఒక్క క్షణం
నీ జీవితపుస్తకంలోని ప్రతీ పేజీకి ప్రాధాన్యతను సంతరించుకోనివా?
నీకై నిర్దేశించబడిన నిమిషాల్లో నుండి ఒక్క నిమిషాన్ని నీ స్వార్ధానికి నువ్వు వాడుకోలేవా!
నీతో నువ్వు,
నీ మనసుతో నువ్వు ముఖాముఖి అవలేవా?
ఒక్కసారి ప్రయత్నించి పరికించి చూడు
నీకే తెలుస్తుంది
నీ మనసుతో మాట్లాడి చూడు
నిన్ను నీకు తెలుపుతుంది సరికొత్తగ నిన్నావిష్కరిస్తుంది
నీ తను వేగంతో జతకట్టలేక వేసారిన తను నువ్వాగిన ఈ నిమిషంతో ఊపిరి పీల్చుకుంటుంది
నీతో కబుర్లు చెబుతుంది
నీకేంటి నీకు నేనున్నాగా అంటూ హామీ ఇస్తుంది
అనుకుంటాం గానీ
మనసుతో మాట్లాడాలని తలపించిన ఒక్క క్షణం
గుండె ఝల్లుమని గతమంతా కనులముందు కదలాడుతూ కనుపాపని ప్రస్తుతాన్ని చూడనీకుండా అడ్డు నిలిచి మసక బారేలా చేస్తుంది
ప్రస్తుతంలో పారాడుతూ గతంలో గమించేలా చేస్తుంది
ఎక్కడ మొదలయ్యాం? ఎలా మొదలయ్యాం?
ఎక్కడ ఆగిపోయాం ఇంకెక్కడి పరిగెత్తలేక రెక్కలు తెగిన పక్షల్లే చతికిల పడుతున్నాం అన్న సర్వాలోచనలు మతిని,మదిని ఆక్రమించేసరికి అణువణువు గిర్రున తిరిగిపోదా!
గుండెల్లో గుబులు చెలరేగుతూ ఉప్పెనల్ని ఊరేగించదా!
తిరగనీ! తిరగనీ! గిర్రున తిరగనీ!
చెలరేగనీ! చెలరేగనీ!
గుండెల్లో గుబులు చెలరేగనీ!
ఊరేగనీ! ఊరేగనీ!
ఉప్పెనల్ని ఊరేగనీ!
తగ్గబోకు వెనక్కి
ఉలిక్కిపడబోకు ఉద్వేగానికి
నీతో నువ్వే మాట్లాడలేని నిమిషం
ఇంకెవరు మాట్లాడ సాహసించగలరు?
నువ్వే తోడులేని నీ మనసుకు ఆప్తమిత్రయై
అక్కున చేర్చుకుని ఆదరించేదెవరు?
ఎన్నెన్ని యోచనలు మూకుమ్మడిగ మధించినా
మరెన్నో ఘోషలు ఏకథాటిగా విలపించినా
చెదరకు అలజడికి ఆజ్యం పోయబోకు
నీతో నేనున్నాననే మాట నిను తమాయింప పలికే నీ మనసును నువ్వు తమాయించలేవా?
అది నీ తరమేగా..
కాదంటావా? కాదన్నా మనస్సాక్షిని మభ్యపెట్టలేవులే!
అందుకే నీకోసం నీతో నువ్వు ఒక్క క్షణాన్ని నీకంకితం చెయ్
నీ మరుసటి రోజున నీ పేజీని నువ్వే తిరగరాయి.
ఇంతకీ ఏమంటావ్!?


నిజమే మనకు మిగిలేది మనమే మనసే అందుకు సాక్షి..చాలా బాగా రాసావు శ్రీ.👌👌👌👌👌
ReplyDeleteThank u dear 😍
ReplyDelete